లిఫ్ట్ గురించి చింతించకండి: శశిథరూర్‌ ట్వీట్‌కు అద్నాన్ సమీ ఘాటు రిప్లై

05-04-2020 Sun 07:13
  • వెలుగులు ఉండగా చీకట్లు ఎందుకన్న థరూర్
  • హృదయంలో కాంతి నింపుకోవాలన్న సమీ
  • ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య వార్
Twitter war between Shashi tharoor and Adnan Sami

నేడు దేశ ప్రజలందరూ విద్యుత్ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపు కాంగ్రెస్ నేత శశిథరూర్, గాయకుడు అద్నాన్ సమీ మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపింది. దేశం మొత్తం ఒకేసారి లైట్లు ఆర్పివేస్తే ఎలక్ట్రిక్ గ్రిడ్ కుప్పకూలిపోతుందని శశిథరూర్ ట్వీట్ చేశారు. థరూర్ ట్వీట్‌కు అద్నాన్ సమీ స్పందించాడు. ప్రజలను ఏకం చేసే ఉద్దేశంతోనే మోదీ ఈ పిలుపు ఇచ్చారని ట్వీట్ చేశాడు. సమీ ట్వీట్‌కు స్పందించిన థరూర్.. ‘‘సోదరా మీ సందేశం హిందూస్థానీలో ఉంటే బాగా అర్థం చేసుకునేవాడిని. వెలుగులు ఉన్నప్పుడు ప్రజలను చీకట్లోకి ఎందుకు నెట్టాలో అర్థం కావడం లేదు. విద్యుత్ లేకుండా లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది?’’ అని ప్రశ్నించారు.

థరూర్ ట్వీట్‌కు సమీ ఈసారి కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘సోదరా మీ మొదటి ట్వీట్ ఇంగ్లిష్‌లో ఉండడంతో నేను ఇంగ్లిష్‌లో సమాధానం ఇచ్చాను. మీరు హిందీలో ఏది రాసినా అదే భాషలో సమాధానం ఇస్తాను’’ అని పేర్కొన్న సమీ.. లిఫ్ట్ గురించి మర్చిపోయి హృదయంలో కాంతి నింపుకోవాలని సూచించాడు. లిఫ్ట్ గురించి చింత వద్దని, అది కాసేపట్లోనే తెరుచుకుంటుందని ట్వీట్ సమీ ట్వీట్ చేశాడు.