జగన్ అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలవడం దురదృష్టకరం: ఐవైఆర్

05-04-2020 Sun 06:55
  • జగన్ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు
  • అలాంటి వారికి జగన్ అండగా నిలవడం దురదృష్టకరం
  • వైద్య సిబ్బందిపై దాడి ఖండించాల్సిన విషయం
IYR Krishnarao fires on AP CM Jagan

ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న వీడియో సందేశం వెలువరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. దేశాన్ని భయపెడుతున్న కరోనా సమస్య ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదని అన్నారు. ఆయన అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎవరైనా ఏ మతస్తులైనా మత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని, రవిశంకర్ శిష్యులైనా, పాల్ శిష్యులైనా, తబ్లిఘీ శిష్యులైనా ఎవరైనా తమ మతానికి చెందిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చన్నారు.

అయితే, ప్రభుత్వం ఎప్పుడైనా అడిగితే వారంతా స్వచ్ఛందంగా వచ్చి సహకరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం వారంతా అలా వచ్చి సహకరించకపోవడమే కాకుండా వికృత చేష్టలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతే కాకుండా సిబ్బందిపై దాడికి దిగడం ఖండించాల్సిన విషయమన్నారు. ఇలాంటి వారికి ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలవడం సరికాదన్న ఐవైఆర్.. మిగిలిన ఆధ్యాత్మిక సమావేశాలతో దీనికి ముడిపెట్టి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఐవైఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.