నిమ్స్ లో ఇక కరోనా రోగులకు ప్రవేశం లేదు: సాధారణ రోగులకు మాత్రమేనన్న తెలంగాణ ప్రభుత్వం

05-04-2020 Sun 06:32
  • నాన్ కొవిడ్ ఆసుపత్రిగా నిమ్స్
  • పేద రోగులకు సేవలను అందించేందుకే
  • జీవోను విడుదల చేసిన ప్రభుత్వం
NIMS is Non Covid Hospital

తెలంగాణలోని నిమ్స్ (నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను నాన్ కొవిడ్ ఆసుపత్రిగా కేసీఆర్ సర్కారు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత, అన్ని ఆసుపత్రులూ, బాధితులు, అనుమానితులతో నిండిపోతుంటే, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు పొందుతున్న పేద రోగులకు అవాంతరం కలిగింది. వారికి వైద్య చికిత్సలు ఆగిపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నిమ్స్ లో ఇకపై ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రోజుకు 2,500 మందిని వైద్యులు పరిశీలిస్తారని, ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలిస్తారని అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి ఆసుపత్రిలో ఓపీ సేవలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిమ్స్ లోని బయాలజీ విభాగంలో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.