దేశంలో కరోనా వ్యాప్తిపై రాశీ ఖన్నా ఆసక్తికర పోస్టు

04-04-2020 Sat 21:32
  • కరోనాను లౌకికవాద వైరస్ గా పేర్కొన్న రాశీ ఖన్నా
  • దానికి మతం, కులం తెలియవని వ్యాఖ్యలు
  • కరోనా వ్యాప్తికి ఇతరులను నిందించడం మానేద్దామని హితవు
Raashi Khanna responds on corona virus spreading

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరు, తాజా పరిణామాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 99.99 శాతం మంది హిందువులు గోమూత్రం తాగరని, గోమూత్రం కరోనా వైరస్ ను ఎదుర్కొంటుందని అసలు నమ్మరని తెలిపారు. అదేవిధంగా, 99.99 శాతం ముస్లింలు తబ్లిగీ జమాత్ ఈవెంట్ కు మద్దతు ఇవ్వరని, జమాత్ అధిపతి మౌలానా సాద్ ఈ కార్యక్రమంలో చెప్పిన మాటలను అంతకన్నా విశ్వసించబోరని అభిప్రాయపడ్డారు.

"కొవిడ్-19 పూర్తిగా లౌకికవాద వైరస్. మతాల ఆధారంగా అది ప్రజలపై వివక్ష ప్రదర్శించదు. అందరిపట్ల సమభావం ప్రదర్శిస్తుంది. తనను తాకిన ప్రతివాళ్లను బాధించడమో, చంపడమో చేస్తుంది. ఈ క్రమంలో వర్గం, కులం, సంపద, మతం అనే అంశాలను ఏమాత్రం పట్టించుకోదు. ఇప్పటికైనా కరోనా వ్యాప్తికి ఒకరిని నిందించడం మానేద్దాం. కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం" అంటూ రాశీ పిలుపునిచ్చారు.