మా అమ్మాయిలిద్దరూ రూ.లక్ష చొప్పున ఇచ్చారు: హీరో రాజశేఖర్

04-04-2020 Sat 20:38
  • మా కుటుంబం తరఫున సాయం చేశారు
  • జీవితతో కలిసి నేను సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను 
  • అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటాం
  • రోడ్లపై ఉండే వారికి కూడా నిత్యావసరాలు అందిస్తున్నాం
rajashekar on corona

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కార్మికులకు సినీనటుడు రాజశేఖర్‌ మొదటి నుంచి సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేస్తూ పలు వివరాలు తెలిపారు. ఈ రోజు తమ అమ్మాయిలు శివానీ, శివాత్మిక చెరో రూ.లక్ష రూపాయలను వారి సంపాదన నుంచి సాయం చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు.

తమ కుటుంబం తరుఫున వారు ఈ చిరు సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి బయటపడే వరకు తమకు సాధ్యమైనంతగా అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సినీ కార్మికులను ఆదుకోవడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

తాను, జీవిత సాధ్యమైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నామని, నిత్యావసర వస్తువులు, ఆహారం వంటివి సినీ కార్మికులకు, ఇతర కార్మికులకు, రోడ్లపై ఉండే వారికి అందిస్తున్నామని చెప్పారు. పేదలకు తమకు చేతనైనంత సాయం చేస్తూనే ఉన్నామని తెలిపారు. తమకు ఎంతో తోడ్పాటు అందించిన ఆహార, నిత్యావసర సరుకుల పంపిణీదారులకు, పోలీస్ అధికారులకు, తమ స్టాఫ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అందరూ ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు.