అంబటి రాంబాబుపై మెగాబద్రర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

04-04-2020 Sat 18:36
  • వెధవ రాజకీయాలు ఎందుకు అంబటి గారూ అంటూ విమర్శలు
  • పవన్ ను విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మేసినట్టేనన్న నాగబాబు
  • మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ట్వీట్
Nagababu furious over YSRCP MLA Ambati Rambabu

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై జనసేన నేత, మెగాబ్రదర్ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఈ సమయంలో వెధవ రాజకీయాలు ఎందుకు అంబటి రాంబాబు గారూ!" అంటూ ధ్వజమెత్తారు. కరోనాతో జనం ప్రాణాలమీదికి వస్తుంటే ఎన్నికలు రద్దు చేసిన ఎలక్షన్ కమిషనర్ ను మీలాగా అడ్డగోలుగా తిట్టకుండా పవన్ కల్యాణ్ తనకు చేతనైనంత సాయం చేస్తున్నాడని, అలాంటి వాడిని విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మేసినట్టుగా ఉంటుందని పేర్కొన్నారు. "సారీ, మీ ముఖానికి మాస్క్ ఉంటుంది కదా, మాస్క్ తీసేసి ఉమ్మితే అప్పుడు కరెక్ట్ గా మీ ముఖంపైనే పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త సార్!" అంటూ ట్వీట్ చేశారు.

"ఇటీవల మీరేదో విందుకు వెళ్లారని, మీకు పైత్యం చేసిందని ప్రజల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయినా మీ ఆరోగ్యం జాగ్రత్త. కారుకూతలు కూయకండి, మీకు పైత్యం చేసిందనుకుంటారు" అంటూ ఘాటుగా స్పందించారు. కరోనా కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వలస కార్మికుల కోసం పవన్ స్పందిస్తుండడంపై అంబటి చేసిన వ్యాఖ్యలు అటు జనసైనికులకు, నాగబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.