లైట్లు మాత్రమే ఆర్పాలి, ఇతర పరికరాలు ఆపాలని ప్రధాని చెప్పలేదు: కేంద్ర విద్యుత్ శాఖ వివరణ

04-04-2020 Sat 18:03
  • రేపు రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయాలన్న ప్రధాని
  • కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్ల వెలుగుతో సంకల్పం చాటాలని పిలుపు
  • ప్రధాని ప్రకటనపై వివరణ ఇచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ
Centre says there should be no switch off other than lights

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ తమ ఇళ్లలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్లు వెలిగించి కరోనాపై సంకల్పం చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దేశం మొత్తం ఒకేసారి లైట్లు ఆర్పితే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

 దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాసింది. రేపు రాత్రి లైట్లు ఆర్పే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యుత్ దీపాలను మాత్రమే ఆపాలని చెప్పారని, ఇంట్లోని ఇతర పరికరాలను కూడా ఆపాలని ఎక్కడా చెప్పలేదని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వీధిలైట్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఆసుపత్రులు, ఇతర అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పనిలేదని తెలిపింది.