Jagan: అది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనలా చూడొద్దు: సీఎం జగన్

CM Jagan tells Delhi incident was not an intentional act
  • ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి కరోనా సోకడం దురదృష్టకరమన్న సీఎం
  • అది ఎవరికైనా జరగొచ్చని వ్యాఖ్యలు
  • కరోనాకు కులమత, ప్రాంతాల తేడా లేదని వెల్లడి
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ వీడియో సందేశం వెలువరించారు. ఢిల్లీలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి విదేశీయులు వచ్చారని, ఆ సమావేశానికి ఏపీ నుంచి కూడా వెళ్లారని తెలిపారు. అయితే ఆ సమావేశానికి వచ్చిన విదేశీయులకు కరోనా వైరస్ ఉండడంతో మనవాళ్లు కూడా కరోనా బారినపడ్డారని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అది ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమావేశం అయినా ఇలాగే జరగవచ్చని అభిప్రాయపడ్డారు.

మనదేశంలో అన్ని మతాల్లోనూ పెద్దలు ఉన్నారని, రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మేళనాల్లో, జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ సమావేశాల్లో, మాతా అమృతానందమయి సభల్లో, పాల్ దినకరన్, జాన్ వెస్లీ తదితరుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.

ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగొచ్చని, అయితే వాటిని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనల్లా చూడకుండా, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనల్లా చూడాలని హితవు పలికారు. ఓ మతానికో, ఓ కులానికో దీన్ని ఆపాదించి, వారు కావాలనే చేసినట్టుగా ఆరోపించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులపై ఆప్యాయత ప్రదర్శించాలని, మనవాళ్లను మనమే వేరుగా చూడరాదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఓ వర్గం మీద ముద్రవేసేందుకు వాడుకోవద్దని సూచించారు.

"కరోనా కాటుకు మతాలు లేవు, కరోనా కాటుకు కులాలు లేవు, కరోనా కాటుకు ప్రాంతాలు లేవు. ధనిక, పేద అన్న తేడా అస్సలు లేదు. రాష్ట్రాలు, దేశాలన్న తేడా లేదు. దీనిపై భారతీయులుగా సమైక్యంగా పోరాడుదాం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇవే సూచనలు చేశారు. చీకట్లు నింపుతున్న కరోనాపై ఆదివారం రాత్రి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి పోరాడుదాం" అని పిలుపునిచ్చారు.
Jagan
Andhra Pradesh
Tablighi Jamaat
New Delhi
Corona Virus
COVID-19

More Telugu News