ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైనా విమాన ప్రయాణ బుకింగ్స్ ప్రారంభం: పౌర విమానయాన సంస్థ

04-04-2020 Sat 17:02
  • లాక్ డౌన్ తో నిలిచిపోయిన విమాన సర్వీసులు
  • ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్ డౌన్ గడువు
  • బుకింగ్ కు సిద్ధమైన ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా
Airlines set to open bookings after lock down completion

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ సర్వీసులే కాదు, దేశీయ రూట్లలో తిరిగే విమానాలు సైతం ఆగిపోయాయి. అయితే, లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, ఆ తర్వాత ఎప్పుడైనా విమాన ప్రయాణ టికెట్ల బుకింగ్ ప్రారంభం కావొచ్చని కేంద్ర పౌర విమానయాన సంస్థ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా వెల్లడించారు.

ఇప్పటికే స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ వంటి ఎయిర్ లైన్స్ సంస్థలు ఏప్రిల్ 15 నుంచి బుకింగ్ లు ప్రారంభిస్తామని తెలిపాయి. ఎయిర్ ఏషియా కూడా ఏప్రిల్ 15 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని వెల్లడించింది. విస్తారా కూడా ఇదే బాటలో నడవనుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా మాత్రం ఏప్రిల్ 30 వరకు టికెట్ బుకింగ్ నిలిపివేసింది. ఏదేమైనా ఎయిర్ లైన్స్ సంస్థల ఊపు చూస్తుంటే ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న సంకేతాలకు బలం చేకూరుతోంది.