'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

04-04-2020 Sat 15:08
  • 75 శాతం షూటింగు జరుపుకున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ 
  • జనవరి 8వ తేదీనే విడుదల
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత షూటింగు జరుగుతుండగానే కరోనా ఎఫెక్ట్ పడింది. ఫలితంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. లాక్ డౌన్ ప్రభావం షూటింగుపై  .. విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా జనవరి 8వ తేదీన విడుదల కాకపోవచ్చని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఒక ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా వరకూ పూర్తయిందనీ, ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమాను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.