లైట్లు ఆఫ్ చేయడం వల్ల గ్రిడ్‌ కుప్పకూలే సమస్య లేదు: తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు

04-04-2020 Sat 12:33
  • ఒకేసారి లైట్లు ఆపడం వల్ల నష్టం లేదు
  • అది పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం చూపదు
  • ఎటువంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నాం
grid problem not araised on 9th says telangana trasco CMD

ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్‌ చేయడం వల్ల పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

అయితే ఈ విధంగా చేయడం ప్రమాదకరమని, పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని సమర్థిస్తున్నారా అన్నట్లు మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌రౌత్‌ కూడా ఇటువంటి ఆందోళననే వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో సీఎండీ ప్రభాకరరావు ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ అటువంటి సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించాలని అన్నారు. తెలంగాణ వరకు గ్రిడ్‌కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.