తమ ప్రయత్నాన్ని ప్రశంసించిన మోదీకి చిరంజీవి ధన్యవాదాలు

04-04-2020 Sat 12:16
  • కరోనాపై ప్రజల్లో  చైతన్యం కోసం టాలీవుడ్ హీరోల పాట
  • నటించిన చిరు, నాగ్, సాయిధరమ్, వరుణ్ తేజ్
  • అందరినీ పేరు పేరునా అభినందించిన మోదీ
Thank you to Modi for appreciating our efforts says chiranjeevi

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాట రూపంలో ప్రజల్లో అవగాహన పెంచే తమ ప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై ప్రజల్లో చైతన్యం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరచి, ఆలపించిన ఈ పాటలో  చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌ నటించారు.

వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాట ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. మంచి స్పందన వచ్చిన ఈ పాటపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. వీడియోలో నటించిన అందరినీ పేరు పేరునా అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.

మోదీ ప్రశంసపై  చిరంజీవి స్పందించారు. తమ ప్రయత్నాన్ని అభినందించిన మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఈ రోజు ట్వీట్ చేశారు. ‘మీ మంచి మాటలకు ధన్యవాదాలు మోదీ గారు. కరోనా కారణంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని నివారించేందుకు మీరు చేస్తున్న నిర్విరామ కృషిని మేం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇంతటి మహాకార్యంలో మేము కూడా మా వంతుగా ఈ చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి గారు, మా అందరి తరపున మీకు నా ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.