Hyderabad: సెభాష్‌ కానిస్టేబుల్‌... విధుల్లో చిత్తశుద్ధికి సీపీ అంజనీకుమార్‌ అభినందన!

CP anjnikumar prised constable for his sincierity
  • రెండు రోజుల క్రితమే భార్యకు ప్రసవం 
  • అయినా విధులు నిర్వర్తిస్తున్న వైనం 
  • స్వీట్లిచ్చి శుభాకాంక్షలు తెలిపిన సీపీ
ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా అధికారి నుంచి కానిస్టేబుల్‌ వరకు పోలీసు సిబ్బంది అంతా క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నారు. ప్రమాదకరంగా వైరస్‌ విస్తరిస్తున్నా ప్రాణాలు పణంగాపెట్టి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌ తనకు రెండు రోజుల క్రితం కొడుకుపుట్టాడని తెలిసినా ఇంటికి వెళ్లకుండా విధులకు అంకితం కావడం చూసి ఆశ్చర్యపోయారు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌. వివరాల్లోకి వెళితే....నిన్నరాత్రి సీపీ అంజనీకుమార్‌ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. దారిలోని చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు.

ఈ సమయంలో లిబర్టీ వద్ద విధుల్లో ఉన్న నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాయికిషన్‌ని పలకరించారు. ఈ సందర్భంగా అతను తనకు రెండు రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పడంతో సీపీ ఆశ్చర్యపోయారు. అటువంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులు నిర్వహిస్తున్న సాయికిషన్‌ని అభినందించి మిఠాయి, బిస్కెట్లు అందించారు.

దీంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన సాయికిషన్‌ సీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధమని తెలిపారు.
Hyderabad
CP anjanikumar
constable

More Telugu News