Narendra Modi: ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉంది: మహారాష్ట్ర మంత్రి హెచ్చరిక

  • 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలన్న మోదీ
  • పవర్ గ్రిడ్‌పై ప్రమాదకర ప్రభావం పడుతుందన్న విద్యుత్‌ నిపుణులు
  • ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలుగుతుందని ఆందోళన
  • లైట్లను స్విచ్ఛాఫ్‌ చేయకుండానే దీపాలు వెలిగించాలని సూచన
PMs call to turn off lights can affect emergency services power grid

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇది సాధారణ విషయం కాదని, పవర్ గ్రిడ్‌పై ప్రమాదకర ప్రభావం పడుతుందని, ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలుగుతుందని మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్ రౌత్ హెచ్చరించారు.

లైట్లను స్విచ్ఛాఫ్‌ చేయకుండానే దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ఆయన సూచించారు.
ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిపై మంత్రి నితిన్‌ రౌత్ వివరంగా మాట్లాడుతూ... 'అన్ని లైట్లను ఆపేస్తే అది గ్రిడ్‌ వైఫల్యానికి దారి తీయొచ్చు. అన్ని అత్యవసర సేవలు నిలిచిపోతాయి, మళ్లీ పవర్ రీస్టోర్‌ చేయాలంటే కొన్ని వారాల సమయం పడుతుంది. లైట్లు స్విచ్ఛాఫ్ చేయకుండానే దీపాలు వెలిగించుకోవాలని ప్రజలను కోరుతున్నాము. లైట్లను ఆఫ్‌ చేయడం వల్ల డిమాండ్, సరఫరా మధ్య భారీ తేడా కనపడుతుంది' అని చెప్పారు.

'ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల 23,000 మెగావాట్ల డిమాండ్‌ కాస్తా 13,000 మెగావాట్లకు చేరుకుంది. కర్మాగారాలు పనిచేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఒక్కసారిగా లైట్లు స్విచ్ఛాఫ్‌ చేస్తే ప్రమాదం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగడం చాలా ముఖ్యం' అని చెప్పారు.

మరోపక్క, కొన్ని విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాలు ఇప్పటికే ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిసింది. అందరూ లైట్లు ఒకేసారి ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇలా విద్యుత్‌ వినియోగం ఒకేసారి పెరిగిపోయినా, లేదా బాగా తగ్గిపోయినా గ్రిడ్‌ పనిచేయడం నిలిచిపోతుంది. విద్యుత్‌ వినియోగంలో 40 శాతం ఒకేసారి తగ్గిపోతే గ్రిడ్‌ కుప్పకూలడానికి ఎక్కువ అవకాశాలున్నాయని కొందరు విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. దీనిపై తాము చర్చలు జరిపామని ఏపీ విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం నేత వేదవ్యాస్‌ చెప్పారు.  

More Telugu News