కరోనా పాజిటివ్‌ వ్యక్తి విందు కార్యక్రమం.. పలువురికి సోకిన కరోనా.. కాలనీ వాసుల్లో ఆందోళన!

04-04-2020 Sat 10:29
  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • దుబాయి నుంచి వచ్చిన సురేశ్‌ అనే వ్యక్తి
  • తల్లి దశ దినకర్మ రోజున భోజనాలు
  • కాలనీ వాసులు బయటకు రావద్దని అధికారుల ఆదేశాలు
coronavirus cases in madhya pradesh

దుబాయి నుంచి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన తల్లి దశదిన కర్మ సందర్భంగా మార్చి 20న తమ కాలనీ వాసులందరికీ భోజనం పెట్టాడు. దాదాపు 1500 మంది ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత అతడితో పాటు అతడి కుటుంబంలోని మరో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
 
మరిన్ని వివరాలలోకి వెళితే, దుబాయ్‌లో సురేశ్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి తల్లి గత నెలలో మరణించడంతో 17న తన సొంత గ్రామం మొరేనాకు తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో తల్లి కర్మ రోజున కాలనీ వాసులు సుమారు 1500 మందికి భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అతడితో పాటు, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్‌ 2న నిర్ధారణ అయింది.

దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడు దుబాయ్‌ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్‌ సోకి వుంటుందని వైద్యులు తెలిపారు. అతడు ఉంటోన్న కాలనీ వాసులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.