అనుబంధం ‘లాక్‌డౌన్‌’...కుమార్తె అంత్యక్రియలకు తండ్రి హాజరుకాలేని దుస్థితి!

04-04-2020 Sat 10:05
  • వీడియోకాల్‌లో చూసి సరిపెట్టుకున్న తండ్రి 
  • పనుల కోసం దుబాయ్ వెళ్లిన నాన్న 
  • అనారోగ్యంతో జగిత్యాల జిల్లాలో కన్నుమూసిన కూతురు
father participate daughter funeral on vedio call

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ఓ తండ్రి తన కుమార్తె అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని దుస్థితి తెచ్చిపెట్టింది. దీంతో దుబాయ్‌లో ఉన్న తండ్రి జగిత్యాల జిల్లా తుంగూరులో జరిగిన కూతురి అంత్యక్రియలను వీడియోకాల్‌లో చూసి సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

 వివరాల్లోకి వెళితే... బీర్‌పూర్ మండలం తుంగూరుకు చెందిన పాలాజీ భాస్కర్, సునీత దంపతులు. వీరికి పదకొండేళ్ల సాహిత్య అనే కుమార్తె ఉంది. తీవ్ర మధుమేహం సమస్య ఉన్న సాహిత్యను బతికించుకునేందుకు వైద్యం కోసం లెక్కలేనన్ని అప్పులు చేశారు భాస్కర్ దంపతులు. 

అప్పులు అధికం కావడంతో పరాయి దేశం వెళితేనే నాలుగు డబ్బులు వెనకేసుకుని తీర్చగలమన్న ఉద్దేశంతో భాస్కర్ ఉపాధి వెతుక్కుంటూ కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇంతలో సాహిత్య మరణించడం, లాక్‌డౌన్‌ కారణంగా భాస్కర్ రాలేని పరిస్థితుల్లో కుమార్తె కడసారి చూపునకు కూడా దూరమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వీడియోకాల్‌లో కుమార్తె అంత్యక్రియులు చూస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.