Hyderabad: ఇక రోడ్డుపైకి వచ్చారో.. మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది జాగ్రత్త: లాక్‌డౌన్ ఉల్లంఘనులకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

  • అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లపైకి యథేచ్ఛగా జనం
  • రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్న పాతబస్తీ యువకులు
  • కఠిన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు
Do not violate Lockdown Hyderabad police warn people

లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో రోడ్లపైకి వస్తున్నవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ఈ మూడు రోజుల్లోనూ వందలాదిమంది రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా పాతబస్తీ యువకులు రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇకపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ జీవో 45, 46, 48 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఐపీసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఒకసారి ఈ చట్టాల కింద కేసులు నమోదైతే ఎందుకూ పనికిరాకుండా పోతారని, భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని అన్నారు. కేసులు నమోదైన వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదని పేర్కొన్నారు.  అంతేకాదు, కేసు నమోదైతే గరిష్ఠంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష ఎదుర్కోవడంతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

More Telugu News