ఏపీలో 164కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. తూర్పుగోదావరి, విశాఖలో కొత్త కేసులు

04-04-2020 Sat 07:31
  • తూర్పుగోదావరిలో రెండు, విశాఖలో ఓ కేసు నమోదు
  • ఆసుపత్రి నుంచి మొత్తం నలుగురు డిశ్చార్జ్ 
  • అందులో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారే
corona cases raised to 164 in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్టణంలో ఒక కేసు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 164కు పెరిగింది. ఇక, కోలుకున్న వారిలో ఒంగోలుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నెల 15న అతడు యూకే నుంచి వచ్చాడని, కరోనా లక్షణాలతో అదే రోజున ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని, మూడుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగటివ్ రావడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కూడా డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. అతడు కూడా యూకే నుంచి వచ్చాడని, కోవిడ్ లక్షణాలతో గత నెల 20న కాకినాడ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. అతడికి కూడా మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు రావడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు వివరించారు. వీరిద్దరితో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.