మీ చక్కని సందేశానికి ధన్యవాదాలు: చిరంజీవి, నాగార్జునకు మోదీ అభినందన

04-04-2020 Sat 06:21
  • కోటి స్వరపరిచిన పాటలో నటించిన చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయితేజ్
  • అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేసిన మోదీ
  • చక్కని సందేశానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
Modi congrats to Chiranjeevi and Nagarjuna

టాలీవుడ్ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జునకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఇటీవల ఓ పాటను స్వరపరిచి ఆలపించాడు.

ఈ పాటలో చిరంజీవి, నాగార్జున, సాయితేజ్, వరుణ్‌తేజ్‌లు నటించారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ చక్కని అవగాహన కల్పించేలా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాటను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వరుణ్‌తేజ్‌కి, సాయితేజ్‌కి మీ అందరూ ఇచ్చిన చక్కని సందేశానికి నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసి అభినందించారు.