కరోనాపై పోరులో భారీ విరాళంతో ముందుకొచ్చిన బిర్లా గ్రూప్

03-04-2020 Fri 22:02
  • కరోనా కట్టడికి రూ.500 కోట్లు
  • రూ.400 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం
  • సహాయక చర్యలు, మాస్కులు, వెంటిలేటర్ల కోసం రూ.100 కోట్లు
Birla Group donates five hundred crores to corona help activities

దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు, సహాయక చర్యలకు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే టాటా, రిలయన్స్ వంటి దిగ్గజ వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా, బిర్లా గ్రూప్ రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్ కు రూ.400 కోట్లు, రూ.50 కోట్లు కరోనా సహాయక చర్యలకు, మరో రూ.50 కోట్లు వైద్య సిబ్బందికి రక్షణ దుస్తులు, వెంటిలేటర్లు, మాస్కుల కోసం అందిస్తున్నట్టు బిర్లా గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

 అంతేకాకుండా, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 10 లక్షల మాస్కులను సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ముంబయి మున్సిపాలిటీ సహకారంతో 100 పడకలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 200 పడకలు ఏర్పాటు చేస్తున్నామని ఆ ప్రకటలో బిర్లా వర్గాలు వివరించాయి.