కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా

03-04-2020 Fri 21:29
  • కొత్తగా తేదీలు ప్రకటిస్తామన్న ఈసీ
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టీకరణ
  • 18 స్థానాలకు ఎన్నికలు
Rajyasabha elections postponed due to corona virus

ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్క వ్యవస్థ ప్రభావితమవుతోంది. తాజాగా భారత్ లో రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన పరిస్థితులలో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. మార్చి 30న పూర్తికావాల్సిన ఎన్నికల ప్రక్రియను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షుభిత పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని ఈసీ వివరించింది. కొత్తగా ఎన్నికల తేదీలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 55 సీట్లకు గాను 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో 4, గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉందని ఈసీ వెల్లడించింది.