మాస్కులతో ఫ్రాన్స్ వెళుతున్న విమానాన్ని అమెరికా అధికధర చెల్లించి తమ దేశానికి మళ్లించిందంటూ కలకలం!

03-04-2020 Fri 21:12
  • చైనా నుంచి ఫ్రాన్స్ వెళుతున్న విమానం
  • అమెరికన్లు మూడు రెట్లు అధికధర ఆఫర్ చేశారంటూ కథనాలు
  • అంతా వట్టిదేనన్న అమెరికా
Is a plane from China to France with masks diverted by Americans

కరోనా కారణంగా తీవ్రంగా నష్టం చవిచూస్తున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. మాస్కులకు, శానిటైజర్లకు సైతం తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. చైనా నుంచి మాస్కులతో ఫ్రాన్స్ వెళుతున్న విమానాన్ని అమెరికా ప్రతినిధులు మూడు రెట్ల నగదు ఆశచూపి తమ దేశం మళ్లించినట్టు కథనాలు వచ్చాయి. ఆ విమానం షాంఝై ఎయిర్ పోర్టు నుంచి మరికొద్దిసేపట్లో ఫ్రాన్స్ వెళుతుందనగా, అమెరికా వ్యక్తుల రంగప్రవేశం పరిస్థితిని మార్చివేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.

అయితే, ఓ విదేశీ బృందం మూడు రెట్లు నగదు అధికంగా ఆఫర్ చేసిన మాట నిజమేనని ఫ్రాన్స్ వర్గాలు చెబుతుండగా, అదంతా వట్టి కట్టుకథేనని అమెరికా అంటోంది. చైనా నుంచి ఫ్రాన్స్ వెళ్లాల్సిన మాస్కులను అమెరికా ప్రభుత్వం  కొనుగోలు చేయలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా స్పందించారు. ఇలాంటి కథనాలు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతూ, తమ దేశంలోనూ ఇలాంటివేమైనా జరుగుతున్నాయేమో చూడాలంటూ అధికారులను ఆదేశించారు.