ఏపీలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది: మంత్రి ఆళ్ల నాని

03-04-2020 Fri 15:39
  • పాజిటివ్ వచ్చిన 140 మందీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారే
  • ఏపీలో టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య పెంచాలని సీఎం నిర్ణయించారు
  • సోమవారం నుంచి విశాఖలో కూడా ల్యాబ్ లో పరీక్షలు 
Corona virus positive increases in AP

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసుల్లో పాజిటివ్ వచ్చిన 140 మందీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని చెప్పారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారని అన్నారు.

ఈ క్రమంలో సోమవారం నుంచి విశాఖపట్నం ల్యాబ్ లో కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాబ్ లు పనిచేస్తుండగా, కొత్తగా గుంటూరు, కడప ప్రాంతాల్లో కూడా ల్యాబ్ లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ లలో 500 మందికి టెస్టులు చేయడం వీలవుతుందని, ప్రైవేట్ ల్యాబ్ ల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు.