Lockdown: లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న

  • ముందుగానే స్పష్టమైన వ్యూహం ఉండాలి
  • లాక్ డౌన్ తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే
  • ఆ తరువాత సమాజం ముందు ఎన్నో సవాళ్లు
  • రివర్స్ మైగ్రేషన్ విషయంలో ముందే జాగ్రత్త పడాలన్న శాస్త్రవేత్తలు
800 Scients Questions Center to tell what is Post Lockdown plan

లాక్ డౌన్ ముగిసిన తరువాత వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏ వ్యూహంతో వెళ్లనుందని దేశంలోని సుమారు 800 మంది విద్యా వేత్తలు, ఆరోగ్య రంగంలోని నిపుణులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీన వారంతా ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల గురించి ముందే వెల్లడించాలని వారు కోరారు. ఐఐఎఫ్ఆర్, ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తలు, ఐఐటీయన్లు, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ ప్రతినిధులు, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ ప్రతినిధులు ఈ స్టేట్ మెంట్ పై సంతకాలు చేశారు.

"లాక్ డౌన్ కేవలం తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే. ఈ సమయం హెల్త్ కేర్ సిస్టమ్ ను ఎలా కాపాడుకోవాలన్న విషయమై ఆలోచించుకునేందుకు సమయాన్ని ఇచ్చింది. లాక్ డౌన్ తరువాత సమాజం ముందున్న సవాళ్లకు ఇంకా సమాధానాలు లేవు. దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఐసీటీఎస్ ప్రతినిధి సువ్రత్ రాజు అభిప్రాయపడ్డారు. వైరస్ కు లాక్ డౌన్ ను చికిత్సగా భావించరాదని ఆయన అన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్ ను తొలగిస్తే, ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తరువాతి ప్రణాళికలపై ముందుగానే ఓ అవగాహనకు రావాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. "భౌతిక దూరాన్ని పాటించడం మంచి నిర్ణయమే అయినా, అదొక్కటే సరిపోదు. ఇక ఇంతవరకూ కరోనా నివారణకు ఓ రోడ్ మ్యాప్ ను కేంద్రం ప్రకటించక పోవడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ లాక్ డౌన్ ముగిసిన తరువాత మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలో ముందే చెప్పాలి" అని కేంద్రానికి పంపిన స్టేట్ మెంట్ లో శాస్త్రవేత్తలు కోరారు.

ఇక, ప్రభుత్వం దేశంలోని కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడంలోనూ ఆలస్యం చేస్తోందన్న అభిప్రాయాన్ని సైంటిస్టులు తమ స్టేట్ మెంట్ లో వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రక్త నమూనాల పరీక్షలపై ఆంక్షలున్నాయని, వాటిని తొలగిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయం తరువాత కరోనా సోకి, బయటకు రాకుండా ఉండిపోయిన వారి ద్వారా వైరస్ ఎంతమందికైనా వ్యాపించవచ్చని వారు హెచ్చరించారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

ఇక లాక్ డౌన్ తరువాత ఏర్పడే మరో ప్రధాన సమస్య రివర్స్ మైగ్రేషన్. ఇప్పటికే నగరాలను వదిలి, తమ స్వస్థలాలకు చేరుకున్న వారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సెంటర్లలో కాలం గడుపుతున్న వారు, తిరిగి పనుల్లోకి వస్తారని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు, వారి విషయంలోనూ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాల్సి వుంటుందని సూచించారు. రివర్స్ మైగ్రేషన్ ను నిలువరించినా సమస్యలు ఎదురవుతాయని, కూలీలు, పేదల పట్ల మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే, వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల నిల్వలను పోలీసుల సాయంతో అవసరమైన వారికి పంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరారు.

More Telugu News