చైనాపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ

03-04-2020 Fri 10:07
  • చైనా చెబుతున్న లెక్కలను నమ్మొద్దన్న సీఐఏ
  • ఆ లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్న నిక్కీ హేలీ
  • తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపాటు
Nikki Haley slams China over corona deaths

కరోనా కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే మరణించారన్న చైనా ప్రకటన వాస్తవానికి చాలా దూరంగా ఉందని అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆరోపించారు. చైనా చెబుతున్న లెక్కలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవని అన్నారు. కరోనా మరణాల విషయంలో చైనా చెబుతున్న లెక్కలను నమ్మొద్దంటూ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజానికి చైనాలో 42 వేల మందికిపైగానే మరణించి ఉంటారన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కరోనా బారినపడి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. యూరప్‌లో రోజూ వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు. చైనాలో కరోనా కేసులు బయటపడిన రెండు నెలలకు అమెరికాకు పాకిన ఈ వైరస్ అక్కడ ఇప్పటికే 5800 మందిని బలితీసుకుంది. 2.4 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తమ దేశంలో మరణించిన వారి సంఖ్యను తక్కువ చేసి చెబుతోందన్న ఆరోపణలున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలకు సాయం చేయాల్సింది పోయి.. తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.