Narendra Modi: ఏప్రిల్ 5, రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు... దేశ ప్రజలంతా ఏం చేయాలంటే...!: ప్రధాని నరేంద్ర మోదీ

  • ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆర్పివేయాలి
  • జ్యోతులు వెలిగించి సంకల్పాన్ని చాటాలి
  • వీడియో సందేశంలో నరేంద్ర మోదీ
Modi Video Message to Country

కరోనాపై పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వీడియో సందేశాన్ని ఇచ్చిన ఆయన, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని సూచించారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలోని విద్యుత్ లైట్లను అన్నిటినీ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద కానీ, బాల్కనీలలో కానీ నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కొవ్వొత్తులను వెలిగించాలని మోదీ కోరారు. లేకపోతే, సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చిలైట్లను వెలిగించాలని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ఇండియాలో అమలవుతున్న లాక్ డౌన్ ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నదని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇండియాను ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయని తెలిపారు. 130 కోట్ల మంది ఒకే పని చేస్తే, ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 5న జ్యోతులు వెలిగించి, మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

More Telugu News