Corona Virus: కరోనా బాధితుల లెక్క తక్కువ చెబుతున్నారు... నిజం చెప్పాల్సిందే!: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

  • నిజాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలి
  • మూడు నెలల రేషన్, పింఛన్ ఒకేసారి ఇవ్వండి
  • అన్న క్యాంటీన్లను తెరిపించాలని డిమాండ్
Chandrabadu Letter to Jagan

కరోనా వ్యాధి బాధితుల లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాలను దాస్తున్నట్టుగా అనుమానం ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిజాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరుతూ సీఎం జగన్ కు ఆయన ఓ లేఖను రాశారు. "రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసులను బయట పెట్టడంలేదు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వైరస్ కారణంగా చనిపోయినా ప్రభుత్వం బయటకు చెప్పడం లేదన్న వార్తలు వస్తున్నాయి. లెక్క తక్కువగా చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉంది. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదు" అని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికోసం వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య జటిలం కాకుండా చూడాలని ఆయన సలహా ఇచ్చారు. వైరస్ సోకిన వారిని ప్రజల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్సలు చేయించాలని చంద్రబాబు తన లేఖలో సూచించారు. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలకు పౌష్టికాహారం కోసం అన్న క్యాంటీన్లను వినియోగించాలని కోరారు.

ఎవరూ పస్తులుండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కేంద్రం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని వినియోగించుకుని, మూడు నెలలకు సరిపడా రేషన్‌, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలను పాటించాలని కోరారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు నిలపవద్దని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుంటే, లాక్‌ డౌన్‌ పేరు చెప్పుకుని జగన్ ప్రభుత్వం, వేతనాల్లో కోత పెట్టడం, వాయిదా వేయడం మంచిది కాదని చంద్రబాబు మండిపడ్డారు.

More Telugu News