Telangana: వైద్యులపై కరోనా రోగుల దాడి ఎఫెక్ట్.. ‘గాంధీ’ వద్ద భారీ బందోబస్తు

  • గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి
  • తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
  • 200 మంది పోలీసులతో గట్టి భద్రత
Full security at secunderabad Gandhi Hospital

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులపై దాడి జరిగిన నేపథ్యంలో మొత్తం 200 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. బుధవారం మృతి చెందిన ఓ రోగి బంధువులు వైద్యులపై దాడిచేయడంతో స్పందించిన ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారిపై దాడి చేయడం సరికాదన్నారు.

వైద్యులపై మరోమారు దాడులు జరగకుండా ఆసుపత్రి వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఐసోలేషన్ వార్డులున్న 5 నుంచి 8 అంతస్తుల మధ్య గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇద్దరు అదనపు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 27 మంది ఎస్ఐలు సహా మొత్తం 200 మందిని గాంధీ ఆసుపత్రి వద్ద మోహరించారు.

More Telugu News