Telangana: కరోనా వార్తల నిజనిర్ధారణ కోసం కొత్త వెబ్ సైట్.. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు!

  • డిజిటల్ మీడియా వార్తలపై నిజనిర్ధారణ 
  • ఫ్యాకల్టీ మీడియాతో కలిసి రూపొందించిన ఐటీఈ అండ్ సీ విభాగం
  • ప్రజలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని వెల్లడి
New Website for Fact Check in Telangana Over Corona virus

డిజిటల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వార్తలు, కథనాలపై నిజ నిర్దారణ కోసం, ఫేక్ వార్తల కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త వెబ్ సైట్ ను ప్రవేశపెట్టింది. 'ఫ్యాక్ట్ చెక్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్'  ( https://factcheck.telangana.gov.in ) పేరిట ఈ వెబ్ సైట్ పని చేస్తుంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ సమయంలో లాక్ డౌన్, వైరస్ వ్యాప్తిపై తప్పుడు వార్తలు, రూమర్లపై నిజానిజాలను తెలుసుకునేందుకు ఈ వెబ్ సైట్ ఉపకరిస్తుంది.

కాగా, ఇప్పటికే 2005 నాటి డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టంతో పాటు 1897 నాటి ఎపిడెమిక్ డిసీజెస్ చట్టానికి అనుబంధంగా ఈ సంవత్సరం తెలంగాణలో జరిగిన ఎపిడెమిక్ డిసీజెస్ (కొవిడ్-19) చట్ట సవరణలను అనుసరించి, నిజానిజాలు తెలుసుకోకుండా, ధ్రువీకరించబడని వార్తలను సర్క్యులేట్ చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని, వీటికి అడ్డుకట్ట వేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవలి తన మీడియా సమావేశంలో సైతం తప్పుడు వార్తలు రాస్తున్న వారిపైనా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా కఠినాతి కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీ, సీఎస్ లను ఆదేశించారు కూడా.

ఇక ఈ వెబ్ సైట్ ను తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం, ఫ్యాకల్టీ మీడియా అండ్ రీసెర్చ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తప్పుడు వార్తలను, సమాచారాన్ని గుర్తించి ప్రజలకు నిజానిజాలను వెల్లడించడమే ఈ వెబ్ సైట్ కర్తవ్యం. ఇక ఈ వెబ్ సైట్లో కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వేగంగా సర్క్యులేట్ అయ్యే వార్తలపై నిజాలను ప్రస్తావిస్తామని, ప్రజలు తమకు ఏవైనా అనుమానాలుంటే, వాటిని పోస్ట్ చేసి నిజాలను అడగవచ్చని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News