Andhra Pradesh: కరోనా ఆపద కాలంలో.. కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ వాలంటీర్ వ్యవస్థ!

  • ఒక్క రోజులోనే ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తి
  • లాక్ డౌన్ సమయంలో ఎంతో ఉపయోగపడుతున్న వ్యవస్థ
  • కరోనా నియంత్రణలోనూ కీలక పాత్ర
Andhraparadesh Village Volunteer System Helps Govt In Corona Time

వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. నిన్న బుధవారం ఒక్కరోజులో, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, 3 లక్షల మందికి పైగా వాలంటీర్లు, దాదాపు 59 లక్షల మందిని ప్రత్యక్షంగా కలిసి వారికి రావాల్సిన పెన్షన్ ను చేతికిచ్చారు.

గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను లబ్దిదారులకు నేరుగా చేరవేయడమే ఈ వ్యవస్థ చేయాల్సిన పని. ఇప్పుడీ వ్యవస్థ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎంతో ఉపకరిస్తోంది.

నిన్న ఉదయం 8.30 గంటలకే 53 శాతం పెన్షనర్లను వాలంటీర్లు కవర్ చేశారు. మధ్యాహ్నానికి 84.19 శాతం, సాయంత్రానికి దాదాపు లబ్దిదారులందరికీ పెన్షన్లను అందించేశారు. ఎవరైనా మిగిలిపోయి వుంటే, వారికి నేడు పెన్షన్ ను అందించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో తాము వైరస్ బారిన పడకుండా వాలంటీర్లు తమ జాగ్రత్తల్లో తామున్నారు. ఎవరి ఫింగర్ ప్రింట్ నూ తీసుకోకుండా, ఫోటో ఐడెంటిటీ కార్డును చూసి పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులకు అందించారు.

ఇక కరోనా వైరస్ తొలి కేసులు నమోదైన తరువాత, ఆయా వ్యక్తులను క్వారంటైన్ చేయాల్సిన బాధ్యతలను కూడా వాలంటీర్లపైనే మోపారు వైఎస్ జగన్. వారు స్థానికంగానే ఉంటుంటారు కాబట్టి, స్థానిక పరిస్థితులు వారికి పూర్తిగా అవగతం కాబట్టి, విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, వారితో కలిసున్న వారిని గుర్తించి, వారి కదలికలను గమనించడంలో కీలక పాత్ర పోషించారు.

కాగా, ఏపీలో వాలంటీర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఈ వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నా, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత, వాలంటీర్లుగా బాధ్యతల్లో ఉండటంతో ఈ వ్యవస్థ ప్రజలకు ప్రస్తుతం ఉపకరిస్తుందనే చెప్పాలి.

More Telugu News