కరోనా ఎఫెక్ట్: అతిపెద్ద ఆర్థిక మాంద్యం రావచ్చంటున్న విశ్లేషకులు!

02-04-2020 Thu 18:07
  • ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం కోరల్లో
  • ఎన్నో ఏళ్లు ఇబ్బందులు ఉంటాయంటున్న నిపుణులు
  • ఆర్థిక వృద్ధికి ఇప్పటికే విఘాతం కలిగించిన కరోనా వైరస్
  • మాంద్యం కాల పరిమితి ఎంతో చెప్పలేమంటున్న నిపుణులు
  • అన్ని దేశాల ప్రభుత్వాలు సకాలంలో చర్యలు చేపట్టాలని సలహా
Global Ression due to Corona is Lasts Very Long

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం అతిపెద్ద ఆర్థిక మాంద్యంలో దాదాపుగా చిక్కుకుపోయినట్టే. ఇప్పుడు నమోదవుతున్న తిరోగమనం, ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికంటే, దీర్ఘకాలం సాగుతుందన్న భయాందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఇది కచ్చితంగా వచ్చే సంవత్సరం, అంతకు మించి కూడా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను తీవ్రతరం చేస్తూ ఉండటం, వైరస్ భయం ఆర్థిక వృద్ధికి ఇప్పటికే ఆటంకం కలిగించడం పారిశ్రామిక రంగంతో పాటు, ఇన్వెస్టర్లను వణికిస్తోంది.

దాదాపు 11 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్థిక మాంద్యం స్వయంకృతం. వ్యవస్థలోని లోపాల కారణంగా ఏర్పడింది. అందుకే రెండేళ్లలోనే మాంద్యం మొత్తం కనుమరుగైంది. కానీ కరోనా కారణంగా ఏర్పడే మాంద్యం అలా కాదు. ఇది ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి. మానవ సాహచర్యం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నంత కాలం, వ్యాపారం గాడిన పడదు సరికదా... ఆర్థిక వ్యవస్థకూడా మరో మెట్టెక్కదు. వైరస్ ఇంతగా విస్తరించిన తరువాత కూడా, విషయం తెలిసీ రద్దీగా ఉండే రెస్టారెంట్లు, కాన్సర్ట్ లకు ప్రజలు హాజరవుతూ ఉండటం, అది కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా కనిపించడం, మాంద్యం కాలపరిమితిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు.

వాణిజ్య కార్యకలాపాలను ఆకస్మికంగా నిలిపివేయడంతో ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితి నుంచి రికవరీ సాధించేందుకే సంవత్సరాల సమయం పడుతుంది. ఇక ఈ మాంద్యం బాధ మరింత లోతుకు వెళితే, కంపెనీలకు ఏర్పడే నష్టాలు దాని కారణంగా ఏర్పడే విపత్తు ఎప్పటికి సద్దుమణుగుతుందన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేని అంశమే అవుతుంది.

ఇప్పటికే ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనాన్ని పరిశీలిస్తే, మాంద్యం ప్రమాద ఘంటికలు మోగాయి. యూఎస్ ఎస్అండ్పీ 500 సూచిక బుధవారం నాడు ఏకంగా 4 శాతాన్ని మించిన పతనాన్ని నమోదు చేసింది. పెట్టుబడిదారులు అత్యధికంగా అమ్మకాలవైపే మొగ్గు చూపారు. అక్టోబర్ 2008 లో ఎస్అండ్ పీ సూచిక 12.5 శాతం పతనం కాగా, ఆపై అత్యధిక పతనం మార్చిలో నమోదైంది.

"ప్రస్తుత మాంద్యం గురించి ఆలోచిస్తే, 2008 ఆర్థిక సంక్షోభం చాలా చిన్నదని భావిస్తున్నాను" అని హార్వర్డ్ ఆర్థికవేత్త, 'ఆర్థిక సంక్షోభాల చరిత్ర' గ్రంథ సహ రచయిత కెన్నెత్ ఎస్ రోగాఫ్ వ్యాఖ్యానించారు. అప్పటితో పోలిస్తే, ఇప్పుడు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వుందని హెచ్చరించారు.

కరోనా కారణంగా ఏర్పడిన కష్టం, గడచిన శతాబ్దంలోనే ఆధునిక ప్రపంచం చూసిన అతిపెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షోభమూ ఎంతకాలం ఉంటుందో కొంతమేరకైనా అంచనాలు ఉండేవని, కానీ కరోనా విషయంలో మాత్రం అంచనాలు దొరకడం లేదని, గతంలో ఏర్పడిన అన్ని ఆర్థిక సంక్షోభాలను మించిన బాధ కలుగనుందని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరిస్థితి మరింత భయంకరంగా కనిపించనుంది. ఈ సంవత్సరం ఇప్పటికే మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. కరెన్సీల విలువలు క్షీణించడం, దిగుమతి చేసుకున్న ఆహారం మరియు ఇంధనం తదితరాలపై పన్నులు పెంచుతున్న ప్రభుత్వాలు, అధికంగా చెల్లించాలని ప్రజలను బలవంతం చేయడం, పలు కంపెనీలు దివాలా స్థితికి చేరుకోవడం, ఉద్దీపనలు కావాలని ప్రభుత్వాలను బెదిరించడం వంటివి పెరిగిపోయాయి.

ఇదే సమయంలో కరెన్సీ విలువ ఒక్కటి మాత్రమే పెట్టుబడిదారులలో కాస్తంత ఆశాజనక దృక్పథానికి కారణం అవుతోంది. మాంద్యం బాధాకరమైనదే కాని, స్వల్పకాలికమేనని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకసారి కరోనా భయం తొలగినా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, అద్భుతమైన వృద్ధి ఈ సంవత్సరమే కంటిముందు ఉంటుందని నమ్మకంతో ఉన్నారు.

 అయితే, వైరస్ ఎప్పటికి అదుపులోకి వస్తుందన్న విషయం మాత్రం ఇప్పటికిప్పుడు ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితి.  ఇక కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు సామాజిక దూరం, నిరంతర అప్రమత్తత ఏళ్ల తరబడి కొనసాగించాల్సి రావచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఖర్చుకు వెనుకాడితే, విస్తరణ పరిమితం అవుతుంది. వృద్ధి కుదేలవుతుంది. ప్రపంచం మరో ఆరేడు దశాబ్దాలు వెనక్కు వెళుతుంది.

కరోనాపై ప్రజల్లో పడిన ముద్ర ఒక్కసారిగా తొలగిపోదని, రికవరీ చాలా నిదానంగా ఉంటుందని, ప్రజల్లో మారే ప్రవర్తనా విధానం, తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు ఎంతో సమయం పట్టవచ్చని, లండన్ కేంద్రంగా పని చేస్తున్న పరిశోధనా సంస్థ టిఎస్ లోంబార్డ్, ముఖ్య ఆర్థికవేత్త చార్లెస్ డుమాస్ వ్యాఖ్యానించారు.

2008 నాటి మహా మాంద్యం తరువాత అమెరికన్లు తమ పొదుపు రేట్లను గణనీయంగా పెంచారు. రుణాలు తీసుకోవడంలో కఠిన నిబంధనలు వారి ఖర్చులకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కంటికి కనిపిస్తోందని అంచనా వేసిన డుమాస్, కార్మికుల వైపు నుంచి పరిశీలిస్తే, ఈ నష్టం చాలా అధికంగా ఉంటుందని తెలిపారు.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న యూఎస్ఏతో పాటు యూరప్ లోని పలు దేశాలు, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, బ్రెజిల్, అర్జెంటీనా మరియు మెక్సికో వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కుదేలు అయ్యాయి. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా పుట్టిన చైనాలో ఈ సంవత్సరం కేవలం 2 శాతం జీడీపీ వృద్ధి మాత్రమే సంభవమని లోంబార్డ్ వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పుడిప్పుడే పలు దేశాలు తమ ప్రజలను ఆదుకునే దిశగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2.5 ట్రిలియన్ డాలర్లను, అంతర్జాతీయ ద్రవ్య నిధి 1 ట్రిలియన్ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేసేందుకు హామీ ఇచ్చింది. తమ వద్ద ఉన్న మొత్తం నిధిని కరోనా చూపే ప్రభావం నుంచి ప్రపంచం బయటపడేందుకు వినియోగిస్తామని ఐఎంఎఫ్ ఇప్పటికే ప్రకటించింది.

అభివృద్ధి చెందిన దేశాలకు కరోనా హెల్త్ షాక్ ఇంకా తగల్లేదని అభిప్రాయపడ్డ ఐరాస డైరెక్టర్ రిచర్డ్ కౌజుల్ - రైట్, ఆ ప్రభావం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందని హెచ్చరించారు. ఈలోగానే చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.