2011 worldup: 28 ఏళ్ల నిరీక్షణ ఫలించి నేటికి తొమ్మిదేళ్లు

On This Day MS Dhoni Led India To ODI World Cup Triumph After 28 Years
  • 2011లో ఇదే రోజు ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా
  • రెండో కప్పు కోసం దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర
  • ఫైనల్లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం
  • ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్న అభిమానులు, క్రికెటర్లు 
భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచి ఈ రోజుతో తొమ్మిదేళ్లు అయింది. 2011 ఏప్రిల్‌ రెండో తేదీన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 1983తో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్ కైవసం చేసుకోగా.. మళ్లీ ఈ కప్పును ముద్దాడేందుకు మన జట్టు 28 ఏళ్లు వేచి చూసింది. అయితే, ఆ నిరీక్షణకు తెరదించుతూ 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని  భారత్ అద్భుత పోరాట పటిమ కనబరిచింది. క్వార్టర్స్‌లో పటిష్ఠ ఆస్ట్రేలియాను ఓడించిన మన జట్టు.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది.

ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో హోరాహోరీగా సాగిన తుదిపోరు అభిమానులకు తీయని జ్ఞాపకం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6  స్కోరు చేయగా.. ఛేదనలో 31 పరుగులకే సచిన్, సెహ్వాగ్ వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. అయితే, గౌతమ్ గంభీర్, ధోనీ 109 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మళ్లీ రేసులోకి తెచ్చారు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ ఔటైనా యువరాజ్‌తో కలిసి ధోనీ ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించాడు. అతను కొట్టిన  విన్నింగ్ సిక్సర్ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలింది. జట్టు గెలిచిన వెంటనే యువరాజ్‌, సచిన్‌ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత సహచరులంతా సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకొని మైదానం మొత్తం తిప్పారు. ఆ జ్ఞాపకాలను  నేడు అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా నెమరు వేసుకున్నారు.
2011 worldup
9 years
Team India
MS Dhoni
28 Years

More Telugu News