Bill Gates: పది వారాలు షట్ డౌన్ చేయకుంటే పెను సంక్షోభమే: ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా

  • మహమ్మారి వ్యాప్తిపై ఎవరినీ నిందించవద్దు
  • ఇంకా రెస్టారెంట్లు, బీచ్ లు తెరచుకునే ఉన్నాయి
  • వైరస్ వ్యాప్తికి షట్ డౌన్ ఒక్కటే మార్గం
  • మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
Bill Gates Called for 10 week Shut down

అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, లేకుంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సూచించారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో, ఆయన 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రికలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

"పెరుగుతున్న మహమ్మారి విషయంలో ఎవరినీ నిందించకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. వైరస్ కూడా అలాగే వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గం" అని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకూ షట్ డౌన్ చేయాలని, అప్పుడే ప్రజలను కాపాడుకోవచ్చని, కనీసం 10 వారాల పాటు దీన్ని అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా ఇచ్చారు. ఈ విషయంలో వెనుకంజ వేస్తే, అది ఆర్థిక బాధలను పెంచుతుందని హెచ్చరించారు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను విపణిలోకి తీసుకురావడానికి ఏడాదిన్నర సమయం అవసరమని భావిస్తున్నప్పటికీ, ఇంకా ముందుగానే వాక్సిన్ ను తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, గత నెల రోజులుగా అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News