Corona Virus: ఇండియాలో నమోదైన కేసులకన్నా వాస్తవ సంఖ్య అధికం: 'ది గార్డియన్' సంచలన కథనం!

  • వైద్య సదుపాయాలు భారత్ లో చాలా తక్కువ
  • ప్రజారోగ్యంపై జీడీపీలో 1.3 శాతం మాత్రమే కేటాయింపులు
  • ఇండియాలో మొదలైన వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్
  • ప్రస్తుతానికి పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నా, క్రమంగా పెరిగే అవకాశం
The Guardian Special Story on Corona in India

ఇండియాలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండివుండవచ్చని 'ది గార్డియన్' సంచలన కథనాన్ని ప్రచురించింది. కరోనా అనుమానితులకు రక్త పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఇండియాలో తక్కువగా ఉందని, చాలా మంది ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేని కారణంగా, వారిలో లక్షణాలున్నా, బయటకు చెప్పని వారే ఎంతో మంది ఉంటారని అభిప్రాయపడ్డ పత్రిక, బయటకు వచ్చిన కేసుల సంఖ్యతో పోలిస్తే, వాస్తవ గణాంకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

ఇండియాలో ఇప్పటివరకూ వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగలేదని చెబుతూ వచ్చిన ప్రభుత్వం, ఢిల్లీలో రెండు వారాల క్రితం జరిగిన మత ప్రార్థనల ప్రభావాన్ని ఇప్పుడిప్పుడే చవిచూస్తోందని పేర్కొంది. ఇండియాలో రోజువారీ కేసుల పెరుగుదల పదుల నుంచి వందల్లోకి చేరిందని గుర్తు చేసింది. గడచిన 24 గంటల వ్యవధిలో 386 కొత్త కేసులు వచ్చాయని గుర్తు చేసింది.

లక్షలాది మంది ప్రజలు ఒకే ప్రాంతంలో నివసించే ముంబైలోని ధారావి మురికివాడకూ వైరస్ వ్యాపించడం భారత్ కు మరింత ఆందోళన కలిగించే అంశమని 'ది గార్డియన్' పేర్కొంది. సుమారు 130 కోట్ల మంది ప్రజలు నివసించే ఇండియాలో, యూరప్, యూఎస్ లతో పోలిస్తే, కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు కనిపించినా, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఎంత వరకైనా వెళ్లవచ్చని హెచ్చరించింది.

భారత జీడీపీలో ప్రజా వైద్యంపై ఖర్చు పెడుతున్నది కేవలం 1.3 శాతమేనని, ఇది ప్రపంచ సగటు కన్నా తక్కువని గుర్తు చేసిన పత్రిక, తొలి కేసు నమోదై రెండు నెలలు గడుస్తున్నా, ఇంతవరకూ కేవలం 47,951 మంది రక్త నమూనాలకు మాత్రమే పరీక్షలు జరిగాయని వెల్లడించింది.

సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ లో 'కరోనా జీహాద్' ట్రెండ్ అవుతోందని, దేశంలో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయని 'ది గార్డియన్' వ్యాఖ్యానించింది.

More Telugu News