Madhya Pradesh: స్క్రీనింగ్ కు వెళ్లిన మహిళా డాక్టర్లపై ఇండోర్ లో ఓ వర్గం రాళ్ల దాడి... తీవ్ర గాయాలు!

Stone Pelting in Indore Women Doctors
  • రెండు పాజిటివ్ కేసులు రావడంతో అధికారుల అప్రమత్తం
  • తమ ప్రాంతానికి వచ్చిన హెల్త్ వర్కర్లపై దాడి చేసిన నిరసనకారులు
  • కర్రలు, రాళ్లతో ఇరుకు వీధుల్లో స్వైర విహారం
మధ్యప్రదేశ్, ఇండోర్ లోని ఓ ప్రాంతానికి కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం హెల్త్ వర్కర్స్ తో కూడిన డాక్టర్ల బృందం వెళ్లగా, ఓ వర్గం వారు ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగడంతో, ఇద్దరు మహిళా వైద్యులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇండోర్ పరిధిలోని రాణీపురా ప్రాంతంలోని కొందరు న్యూఢిల్లీలోని ప్రార్థనలకు వెళ్లి వచ్చారని తెలుసుకున్న అధికారులు, ఆ ప్రాంతానికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది.

లేత నీలం రంగు పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) ధరించిన వైద్యులను చుట్టుముట్టిన స్థానికులు కొందరు వారిపై రాళ్లు విసిరారు. ప్లాస్టిక్ వస్తువులను సైతం వారిపై వేశారు. ఇందుకు సంబంధించిన ఓ నిమిషం నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 100 మంది నిరసనకారులు, కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చి, ఇరుకుగా ఉన్న వీధిలో హెల్త్ వర్కర్ల వెంట పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రాంతంలో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు రావడంతో, అప్రమత్తమైన అధికారులు, 54 కుటుంబాల వారిని క్వారంటైన్ చేసేందుకు వెళ్లగా, స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మధ్యప్రదేశ్ లో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం ఇండోర్ వే కావడం గమనార్హం. కాగా, డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 
Madhya Pradesh
Indore
Corona Virus
Stone Pelting
Doctors

More Telugu News