Ontimitta: ఒంటిమిట్టలో నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ!

No Piligrims in Ontimitta Brahmotsavams
  • ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు
  • శేష వాహనంపై గ్రామోత్సవం
  • పరిమిత సంఖ్యలోనే పూజారులు, అధికారులు
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించడంతో, అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. ఆపై ఆగమశాస్త్ర ప్రకారం, పుట్టమన్నును తీసుకుని వచ్చి, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, నేటి రాత్రి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.

7వ తేదీ రాత్రి, పున్నమి వెన్నెల కాంతుల్లో స్వామివారి కల్యాణాన్ని కూడా పరిమిత సంఖ్యలో హాజరయ్యే పూజారులు, అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయ డిప్యూటీ ఈఓ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు కిక్కిరిసిపోయే ఒంటిమిట్ట, ఇప్పుడు భక్తులు కనిపించక బోసిపోయింది.
Ontimitta
Kadapa District
Kodanda Ramalayam
Brahmotsavams

More Telugu News