Ajit Doval: తెల్లవారుజామున రెండు గంటలకు మర్కజ్ కు అజిత్ దోవల్.. ఆపరేషన్ సక్సెస్!

  • బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మర్కజ్‌కు రాక
  • అంతకు ముందే మత పెద్దలతో మాట్లాడిన దోవల్
  • ఆ తర్వాతే మర్కజ్ ఖాళీ చేసేందుకు అంగీకారం
NSA Ajit Doval visited Nizamuddin area at 2 am

లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన కేసుల్లో మెజారిటీ వంతు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందినవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అందరి దృష్టి మర్కజ్ మసీదు భవన సముదాయంపైనే నిలిచింది. అక్కడ జరిగిన సదస్సుకు దేశ విదేశాల నుంచి రెండు వేల పైచిలుకు మంది హాజరయ్యారు. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మర్కజ్‌కు వచ్చారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడారని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

మర్కజ్‌ను ఖాళీ చేసేందుకు తొలుత మత పెద్దలు నిరాకరించినట్టు సమాచారం. భవనాన్ని ఖాళీ చేయాలని మార్చి 23వ తేదీనే నిజాముద్దీన్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌజ్ ఆఫీసర్ ముఖేష్ వలియాల్ మత పెద్దలను పిలిపించి విజ్ఞప్తి చేశారని, అయినా వాళ్లు వినలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా పోలీసులు మసీదు వద్దకు వచ్చినా, నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని సమాచారం. దాంతో, ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. షా సూచనల మేరకు అజిత్‌ దోవల్ రంగంలోకి దిగినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

మర్కజ్‌కు వచ్చే ముందే మత పెద్దలతో అజిత్‌ పలుమార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారని సమాచారం. అజిత్‌ ప్రయత్నాలు ఫలించడంతో మత పెద్దలు మర్కజ్‌ను ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున అక్కడికి వచ్చిన దోవల్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. మర్కజ్ భవనం నుంచి 36 గంటలల్లో 2361 మందిని తరలించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.

More Telugu News