ap7am logo

మూడు నెలల మారటోరియం సదుపాయాన్ని వాడుకోవాలా? వద్దా?.. నిపుణుల సలహాలు!

Wed, Apr 01, 2020, 12:54 PM
  • మూడు నెలల మారటోరియం విధించిన ఆర్బీఐ
  • చెల్లించకుంటే జూన్ లో వడ్డీ భారం
  • ఆర్థిక ఇబ్బందులు లేకుంటే కట్టేస్తేనే మేలు
  • సలహా ఇస్తున్న ఆర్థిక నిపుణులు
కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వేళ, గత వారంలో ఆర్బీఐ రుణ గ్రహీతలకు కొంత వెసులుబాటు కల్పిస్తూ, టర్మ్ లోన్స్ పై మూడు నెలల మారటోరియాన్ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా రుణాలు తీసుకున్న వారికి మూడు నెలల పాటు చేతిలో డబ్బులు మిగిలే అవకాశం లభించింది. క్రెడిట్ కార్డు ఈఎంఐలను సైతం పోస్ట్ పోన్ చేసే సదుపాయం దగ్గరైంది. అయితే, ఈ మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకోవాలా? వద్దా? అన్న విషయంలో ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారో ఓమారు పరిశీలిస్తే...

అసంఘటిత రంగంలోని వారికి మూడు నెలల ఈఎంఐ మారటోరియం చాలా లాభదాయకమనే చెప్పాలి. చిరు వ్యాపారాలు చేసుకునే వారు, వేతన జీవులు, శాలరీల్లో కోతను ఎదుర్కొనే వారు, వేతనాలను ఆలస్యంగా తీసుకునే వారు... తదితర వర్గాల వారితో పాటు లాక్ డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయిన వారికి ఈ సౌలభ్యం ఉపకరిస్తుంది.

ఒకవేళ ఈ సమయంలో మీరు ఉపాధిని కోల్పోతామన్న భయాందోళనలో ఉంటే, మారటోరియంను ఉపయోగించుకుని, భవిష్యత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఈ మూడు నెలల పాటూ చెల్లింపులు జరపకపోయినా, మీ క్రెడిట్ స్కోర్ లో మార్పులు ఉండవు.

ఇక ఇదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మూడు నెలల వడ్డీని కూడా చెల్లించాల్సిందే. వడ్డీ మినహాయింపులు మాత్రం ఉండవు. అంటే, మూడు నెలల తరువాత మీరు వడ్డీ రూపంలో అధిక మొత్తాన్ని కట్టాల్సి వుంటుంది. మీ టర్మ్ లోన్ కూడా ఆ మేరకు మూడు నెలలు పొడిగించబడుతుంది.

ఇక స్థిరమైన ఆదాయం ఉన్నవారు, ఇప్పటికే కొద్దో, గొప్పో పొదుపు చేస్తున్న వారు, ఈ మూడు నెలలు కూడా ఈఎంఐలను చెల్లిస్తేనే మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. పెరిగే లోన్ కాలపరిమితి, అధిక వడ్డీల భారాన్ని తప్పించుకోవాలంటే, నెలవారీ చెల్లింపులను కొనసాగించాలని 'ఇంటర్నేషనల్ మనీ మ్యాటర్స్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ లోవై నవ్లాఖీ వ్యాఖ్యానించారు.

మూడు నెలల మారటోరియంను అత్యధికులు స్వాగతిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఒక నెల చెల్లించలేకపోయినా, మిగతా రెండు నెలలైనా చెల్లిస్తేనే మంచిదని  'ప్లాన్ ఎహెడ్ వెల్త్ అడ్వయిజర్స్' వ్యవస్థాపకులు విశాల్ ధావన్ సలహా ఇచ్చారు. వడ్డీ పెరుగుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రత్యక్షంగా ప్రభావం పడిన పరిశ్రమలో పని చేస్తున్నట్లయితే, మీ వేతనం పూర్తిగా నిలిపివేయబడుతుంది లేదా కొంత కట్ అయి కొంత వేతనం మాత్రమే చేతికి వచ్చే అవకాశాలే అధికం కాబట్టి, ఇతర ఖర్చులను తగ్గించుకోవాలని, అన్ని పరిస్థితులను గమనించి మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకునే విషయమై ముందడుగు వేయాలని ఆయన సూచించారు.

మార్చి, ఏప్రిల్, మేలలో నెలసరి కిస్తీలు చెల్లించకుంటే, తదుపరి జూన్ నెలలో ఈ మూడు నెలల వడ్డీని కలిపి ఒకేసారి చెల్లించాల్సి వుంటుందని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వయిజర్ హర్ష రూంగ్తా హెచ్చరించారు. లాక్ డౌన్ కారణంగా నగదు నిల్వలపై ప్రభావం పడదని భావించే వారు చెల్లింపులు జరిపితేనే మంచిదని, అప్పుడే జూన్ లో ఒకేసారి పెద్ద మొత్తంగా పడే భారాన్ని తప్పించుకోవచ్చని ఆయన సూచించారు.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad