Love Agarwal: వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ వేగవంతం: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Corona Virus Vaccine Research in India
  • ప్రభుత్వ సారథ్యంలో సన్నాహాలు
  • ప్రజలు సామాజిక దూరం పాటించాలి
  • ఆందోళన అవసరం లేదన్న లవ్ అగర్వాల్
ఇండియాలో కరోనా మహమ్మారి నివారణకు ఉపకరించే వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, వ్యాక్సిన్ తయారీ దిశగా ప్రభుత్వ సారథ్యంలో సన్నాహాలు సాగుతున్నాయని తెలిపారు.

ఇండియాలో విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తిస్తున్నామని, వారిని క్వారంటైన్‌ కు తరలించే ప్రక్రియ కూడా పకడ్బందీగా సాగుతోందని ఆయన అన్నారు. వైరస్‌ అధికంగా వ్యాపించిన హాట్‌ స్పాట్‌ లను ఇప్పటికే గుర్తించి, వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని, వైద్య సిబ్బంది రక్షణకు ఉపయోగపడే పరికరాలను సైతం పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు.

కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల సహకారంతో దీన్ని పారద్రోలుతామన్న ఆశాభావాన్ని లవ్ అగర్వాల్ వ్యక్తం చేశారు. ప్రజలంతా మాస్క్ లను ధరించాల్సిన అవసరం లేదని, దగ్గు, జలుబు ఉంటేనే వాటిని ముఖానికి ధరించాలని సూచించారు. ఇదే సమయంలో సామాజిక దూరం పాటించడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. వైరస్‌ కారణంగా గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరణాలు అధికంగా ఉన్నాయని, ప్రజల నుంచి సకాలంలో సమాచారం అందకపోవడం తోనే వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
Love Agarwal
Corona Virus
Vaccine

More Telugu News