Corona Virus: ప్రతి ఒక్కరు ఎన్ 95 మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు: ఐపీఎం డైరెక్టర్

  • దగ్గు, జలుబు ఉన్నవారు మాస్కులు ధరిస్తే సరిపోతుంది
  • మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారే
  • చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి
IPM Director Doctor Shankar speaks about N95 masks

కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో దాని బారినపడకుండా తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరు ఎన్95 మాస్కులు ధరిస్తున్నారు. అయితే, ఇలా అందరూ ఆ మాస్కులు ధరించాల్సిన పనిలేదని, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే ధరిస్తే సరిపోతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు లక్షణాలున్నవారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. మాసాబ్ ట్యాంకులోని ఐఅండ్‌పీఆర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అపోహలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారంతా 60 ఏళ్లు పైబడినవారేనని, వారంతా అప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. వైద్య పరమైన సదుపాయాలు ఎన్ని ఉన్నప్పటికీ వైరస్ విస్తరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటిస్తే వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. పదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆహారం విషయంలో అపోహలకు తావులేదని, పూర్తిగా శుభ్రం చేసి ఉడికించిన ఆహారం ఏదైనా తీసుకోవచ్చన్నారు. బయటకు వెళ్లినవారు భౌతిక దూరాన్ని తప్పకుండా పాటిస్తే వైరస్‌ విస్తరణను అడ్డుకోవచ్చని డాక్టర్ శంకర్ తెలిపారు.

More Telugu News