Liton Das: బంగ్లా క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పించుకున్న భార్య

Liton Das wife Devasri Biswas injured in gas cylinder blast
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • ముఖం కాలిపోకుండా చేతులు అడ్డం పెట్టుకోవడంతో గాయాలు
  • చావు అంచుల వరకు వెళ్లొచ్చానన్న దేవశ్రీ
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత (27) త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. టీ పెట్టేందుకు వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముఖాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చేతులు అడ్డుపెట్టడంతో తీవ్ర గాయాలైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పేలుడు ధాటికి కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో గాయాలయ్యాయి.

రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా ఆమె ఈ విషయాన్ని షేర్ చేయడంతో వెలుగుచూసింది. తాను ఆ రోజు చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని తెలిపింది. చేతులు కనుక అడ్డం పెట్టుకోకపోయి ఉంటే ముఖం పూర్తిగా కాలిపోయేదని పేర్కొంది. జుట్టును కట్ చేసుకోవాల్సి వచ్చిందని అయితే, తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. గ్యాస్ సిలిండర్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా, 2019 ప్రపంచకప్ తర్వాత లిటన్ దాస్, దేవశ్రీల వివాహం జరిగింది.
Liton Das
Bangladesh
Devasri Biswas
Gas Cylinder

More Telugu News