Home ministry: ‘మర్కజ్’ కు ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై కేంద్ర హోం శాఖ లోతైన దర్యాప్తు

  • ‘మర్కజ్’ కు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి హాజరు
  • ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్ధారణ
  •  వివరాలు సేకరించాలని ఆయా రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలు
Central Home Ministry serious investigation about Markar Mosque inicident

ఈ నెల 8-10 తేదీలలో ఢిల్లీ లోని మర్కజ్ మసీదులో నిర్వహించిన మతపరమైన కార్యక్రమాలకు దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఇప్పటికే పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లోతైన దర్యాప్తు చేపట్టినట్టు కేంద్ర హోం శాఖ ఈరోజు వెల్లడించింది.

మర్కజ్ మసీదులో నిర్వహించిన కార్యక్రమాలకు ఎవరెవరు హాజరయ్యారన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, మయన్మార్, కజకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్లు చాలా మంది ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నిర్ధారించింది. విదేశాల నుంచి మర్కజ్ మసీదుకు వచ్చిన వారు అక్కడ రిపోర్టు చేసిన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారని, ఆయా రాష్ట్రాల్లోని జిల్లా కో-ఆర్డినేటర్ల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

మార్చి 21 నాటికి ఈ మసీదులో 1746 మంది ఉన్నారని, అందులో 1530 మంది దేశీయులు కాగా, 216 మంది విదేశీయులు అని తెలిపింది. భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని, ఇప్పటి వరకు 2137 మంది కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలించామని పేర్కొంది.  తబ్లీక్ కార్యకర్తలు తిరిగిన ప్రాంతాలు, వారు కలిసిన వ్యక్తుల వివరాలను సేకరించాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఆదేశించినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.

More Telugu News