Corona Virus: నగరాల నుంచి వలస వెళుతున్న ప్రతి 10 మందిలో ముగ్గురి నుంచి కరోనా విస్తరించొచ్చు!: కేంద్ర ప్రభుత్వం

  • 22.88 లక్షల మంది వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం అందిస్తున్నాం
  • ప్రస్తుతం ఎవరూ రోడ్లపై లేరు
  • ల్యాబ్ ల సంఖ్య 118కి పెంచాం
3 out of 10 moving from cities to villages may carry corona virus center tells Supreme Court

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలోని నగరాల నుంచి గ్రామాలకు వలస వెళుతున్న ప్రతి 10 మందిలో ముగ్గుర్నుంచి కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు విన్నవించారు.

ఎయిర్ పోర్టులు, ఓడ రేవుల్లో 28 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని... వీరిలో 3.5 లక్షల మందిని పరిశీలనలో ఉంచామని చెప్పారు. వలస కూలీలకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ఈ వివరాలను వెల్లడించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఆగిపోయిన 22.88 లక్షల మంది కార్మికులు, కూలీలు, పేదల కోసం అన్ని ప్రభుత్వాలు ఆహారం, ఆశ్రయాన్ని అందిస్తున్నాయని తుషార్ మెహతా తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర హోం సెక్రటరీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఏ ఒక్క వలస కార్మికుడు కూడా ప్రస్తుతం రోడ్డుపై లేడని... ప్రతి ఒక్కరిని సమీపంలోని షెల్టర్ కు తరలించారని చెప్పారు.

కరోనాకు సంబంధించి ఫేక్ న్యూస్ బాగా ప్రచారమవుతోందని సొలిసిటర్ జనరల్ ఆందోళన వ్యక్తం చేయగా... తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రపంచ మానవాళికి కరోనా ప్రమాదకరంగా పరిణమించిందనే సమయానికి మన దేశంలో కేవలం పూణేలో మాత్రమే ల్యాబ్ ఉందని... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆ సంఖ్యను 118కి పెంచామని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ప్రతిరోజు 15 వేల మంది శాంపిల్స్ ను టెస్ట్ చేసే సామర్థ్యం మనకు ఉందని చెప్పారు.

More Telugu News