India: ఇండియాలో కరోనా వైరస్ వేగం ఎంతో ఈ వారమే తేలుతుంది!

  • తొలి పాజిటివ్ వచ్చి నేటికి రెండు నెలలు
  • రాబోయే వారం రోజుల్లో గణాంకాలను విశ్లేషించిన నిపుణులు
  • లాక్ డౌన్ ప్రభావం ఏ మేరకో తెలుస్తుందని అంచనా
Corona Spread Speed knows in Next Week in India

ఇండియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి నేటికి సరిగ్గా రెండు నెలలు. ఫిబ్రవరి 1న తొలి కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఇండియా, 1000కిపైగా కేసులు నమోదైన 42 దేశాల సరసన చేరింది. ఇక ఇప్పటి నుంచి రాబోయే రెండు వారాలు మనకు అత్యంత కీలకం కానున్నాయి. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందన్న విషయం ఈ వారంలోనే తేలుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందన్న విషయం కూడా ఈ వారంలోనే వెల్లడి అవుతుందని తెలుస్తోంది.

ఇక మార్చి 23 నాటికి ఇండియాలో 468 కేసులుండగా, సరిగ్గా వారం తరువాత అంటే, మార్చి 30 నాటికి 1,251 కేసులు నమోదయ్యాయి. ఇదే వేగంతో కేసులు పెరిగితే, మరో వారానికి... అంటే, ఏప్రిల్ 6 నాటికి 2,451 కేసులు నమోదవుతాయి.

ఇక గత వారంలో 1000 కేసులు దాటిన దేశాలను పరిశీలిస్తే, చిలీలో 23 రోజుల్లో, చెక్ రిపబ్లిక్ లో 22 రోజుల్లో, టర్కీలో 12 రోజుల్లో, ఐర్లాండ్ లో 24 రోజుల్లోనే నమోదయ్యాయి. ఇదే సమయంలో సరాసరి రోజువారీ కేసుల పెరుగుదలను పరిశీలిస్తే, చైనాలో 1,498, స్పెయిన్ లో 1,141, యూఎస్ లో 1,158, ఇటలీలో 679, ఇరాన్ లో 809, సౌత్ కొరియాలో 597 మంది, యూకేలో 554 మంది వైరస్ బారినపడ్డారు.

ఇండియాలో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో 1000వ కేసు నమోదైంది. పరిస్థితి అత్యంత దారుణంగా... అంటే, చైనాలో వున్నటువంటి పరిస్థితే ఇండియాలో కూడా ఉండివుంటే, గరిష్ఠంగా ఈ వారంలో 9,140కి కేసుల సంఖ్య చేరుతుందన్నది ఓ అంచనా. ఇదే సమయంలో కేసుల పెరుగుదల అతి తక్కువగా జపాన్ స్థాయిలో కేసులు పెరిగితే, ఏప్రిల్ 6 నాటికి కేసుల సంఖ్య 1,524 వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో ఇండియాలో రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల గణాంకాలను బట్టి, మరో వారంలో కేరళలో 562, మహారాష్ట్రలో 503, ఢిల్లీలో 324, కర్ణాటకలో 194, ఉత్తరప్రదేశ్ లో 181, తెలంగాణలో 149, గుజరాత్, రాజస్థాన్ లో 116 వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News