Andhra Pradesh: ఆసుపత్రుల సేవల విషయంలో... జాతీయ విపత్తుల నివారణ చట్టాన్ని ప్రయోగించిన జగన్ సర్కారు

  • తొలి దశలో 450 ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలోకి
  • పరిస్థితిని బట్టి మరింతగా పెంచే అవకాశం
  • ప్రైవేటు వైద్యులను ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానిదే
  • ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి
Andhrapradesh Government New GO on Private Hospitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్ లను ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 సెక్షన్‌ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు ఇక సర్కారు పరిధిలో పనిచేయాలని ఆదేశించారు. తొలి దశలో 450 ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తి పరిస్థితిని బట్టి ఈ సంఖ్య పెంచుతామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే, ప్రైవేట్‌ / ప్రభుత్వేతర మెడికల్, హెల్త్‌ ఇనిస్టిట్యూషన్స్, అందులోని సిబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐసోలేషన్‌ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ ల్యాబ్స్, ఫార్మసీలు, మార్చురీలు, మెడికల్ ఎక్విప్‌మెంట్, అత్యవసర రెస్పాన్స్‌ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాల్సి వుంటుంది.

ఏ వసతుల వినియోగానికైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుంది. ఈ ఆసుపత్రులన్నీ జిల్లా స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు సహా అక్కడ పని చేస్తున్న ఎవరినైనా ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు.

More Telugu News