Andhra Pradesh: ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి ఏపీ నుంచి 500 మంది.. రాష్ట్రంలో కలకలం!

  • ఒక్క రోజు వ్యవధిలోనే ఓ వ్యక్తి తల్లిదండ్రులు మృతి
  • 200 మంది నుంచి నమూనాల సేకరణ
  • ఐదుగురికి కరోనా నిర్ధారణ
500 people from AP return from Delhi 5 of them attacked to Coronavirus

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిలోనూ ఈ లక్షణాలు బయటపడడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందోనని హడలిపోతున్నారు.

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 200 మంది నుంచి  నమూనాలు సేకరించి పరీక్షించగా ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నమూనాలు సేకరించిన 200 మందిలో 103 మంది ఒక్క ప్రకాశం జిల్లావారే కావడం గమనార్హం. వీరందరినీ వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉంచారు.

ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చిన విజయవాడ యువకుడి తల్లిదండ్రులు ఒక్క రోజు వ్యవధిలోని చనిపోవడం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. చనిపోయిన వారి నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షలకు పంపించారు.

అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడి తల్లి ఇటీవల మక్కా వెళ్లి వచ్చింది. మూడు రోజుల క్రితం ఆమె మృతి చెందగా, బాలుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 40 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతుండగా, వీరిలో 17 మంది ఢిల్లీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరిలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.

More Telugu News