ap7am logo

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘కోవిడ్ 19 అత్యవసర పాస్’ల మంజూరుకు సన్నాహాలు

Mon, Mar 30, 2020, 03:14 PM
  • అత్యవసర సేవలలో ఉన్న ప్రవేటు వ్యక్తుల కోసం పాస్
  • దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
  • మొబైల్ ఫోన్లో క్యూఆర్ కోడ్, చెక్ పోస్టుల వద్ద స్కానింగ్ 
  • చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా వెల్లడి  
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కోవిడ్- 19 అత్యవసర పాస్ లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు జారీ చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి, చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు.

ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పని చేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు. వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 జాబితాలో చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి, సరఫరాలో నిమగ్నమై ఉన్న వాళ్లందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే. పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

‘కరోనా’ నివారణ సేవలలో ఉన్న వాళ్లందరూ ఈ పాస్ ల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుండి 11 వరకు) అవసరమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, తదనుగుణ వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్ తో పని లేదు.

పాస్ మంజూరుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే  

పాస్ పొందేందుకు ఎవ్వరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని హిమాన్హు శుక్లా తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.  https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration లింక్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (https://www.spandana.ap.gov.in/) ద్వారా కూడా పాస్ పొందవచ్చు. దరఖాస్తులను జిల్లా కంట్రోల్ సెంటర్ ఛైర్మన్, సంయిక్త కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం కలిగి ఉంటారు.

భద్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం

నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని హిమాన్ష్ శుక్లా వివరించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందిస్తామని, తద్వారా పోలీసుల అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న శుక్లా, ఈ పాస్ కు పాస్లో ఎన్ క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉందని, చెక్ పోస్టులలోని పోలీస్ సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక, అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం వివరించారు. ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదని, పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు ఫిర్యాదు చేస్తే అవి జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి వెళతాయని చెప్పారు.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad