Hyderabad: వారెవరు...ఎక్కడి వారు?: ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులపై ఆరా

  • ఒకే రోజు మూడు రైళ్లలో ప్రయాణించిన కరోనా బాధితుడు 
  • దీంతో అతని తోటి ప్రయాణికులపై దృష్టి 
  • జల్లెడ పడుతున్న రైల్వే పోలీసులు
railway police traking MMTS passengers

అతనో రైల్వే ఉద్యోగి. అతనికి కరోనా సోకిందన్న విషయం అతనికి తెలుసో లేదో తెలియదు. ఆగ్రా నుంచి కర్నూలుకు చేరే క్రమంలో మూడు రైళ్లలో ప్రయాణించాడు. ఇంటికి చేరాక అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పుడు అతనితోపాటు ప్రయాణించిన వారెవరా? అన్నదాని కోసం రైల్వే పోలీసులు పరుగులు పెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే... ఓ ఇరవై మూడేళ్ల యువకుడు గుంతకల్లు డివిజన్ పరిధిలోని ఓ రైల్వే స్టేషన్లో ట్రాక్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న రాత్రి 8 గంటలకు అతను ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. ఎస్ 2 బోగీలో ప్రయాణించి మరునాడు (18న) రాత్రి ఏడు గంటలకు సికింద్రాబాద్ చేరుకున్నాడు. పది నిమిషాల తర్వాత అదే స్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కి కాచిగూడలో దిగాడు.

రాత్రి 8.05 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎస్5 బోగీలో కర్నూలు వెళ్లాడు. అనంతరం అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు సమస్యంతా ఆగ్రా నుంచి కర్నూలు చేరేందుకు అతను ప్రయాణించిన మూడు రైళ్లలో అతనితోపాటు ఎవరెవరు ప్రయాణించారన్నది. దానిపై రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు.

తెలంగాణ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్ల పాసింజర్ల వివరాలు రైల్వే వద్ద ఉంటాయి. కాబట్టి, ఈజీగా గుర్తించగలిగారు. కానీ ఎంఎంటీఎస్ రైలు వివరాలు ఉండవు. దీంతో ఆ రైలులో ప్రయాణించిన వారు ఎవరో అర్థంకాక రైల్వే పోలీసులు జనరల్ హెచ్చరిక జారీ చేశారు.

ఈనెల 18వ తేదీ రాత్రి 7.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాచిగూడ స్టేషన్ వరకు ఫలక్‌నుమా వెళ్లే ఎంఎంటీఎస్ లో ఎవరెవరు ప్రయాణించారో వారు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించిన వారు తక్షణం వైద్యులను సంపద్రించాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.

More Telugu News