Corona Virus: కరోనాతో మా దేశంలో రెండు లక్షల మంది చనిపోయే ప్రమాదం: అమెరికా వైద్య నిపుణుడు

  • కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం
  • మరో నెల రోజులపాటు ఆంక్షలు పొడిగించిన ట్రంప్
  • ఇప్పటికే లక్షా 40 వేల మందికి పాజిటివ్‌
  • 2400 పైచిలుకు మరణాలు
In worst case scenario 200000 Americans could die predicts an health expert

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో, ఈ మహమ్మారి వైరస్‌ బారిన పడి తమ దేశంలో లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని అమెరికా వైద్య నిపుణుడు ఆంథోనీ ఫాసి హెచ్చరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా చనిపోతున్న తమ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి కిటికీల నుంచే వీడ్కోలు పలుకుతున్న హృదయ విదారక దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ఇలాంటి దారుణ పరిస్థితులే ఉండడం, ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపించే ప్రమాదం మరింత ఎక్కువ కావడంతో మరో 30 రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. కరోనా  కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఏప్రిల్ చివరి వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలంతా సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మరికొన్ని వారాల్లోనే  దేశంలో పరిస్థితులు మెరుగవుతాయని ప్రకటించిన కొద్ది రోజులకే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అలర్జీ, అంటు వ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్ అయిన ఆంథోనీ ఫాసి తమ దేశ భవిష్యత్‌పై అంచనా వేశారు. అమెరికాలో కొన్ని మిలియన్ల ప్రజలకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో తమ దేశం పురోగతి సాధిస్తోందని చెప్పడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఆదివారం రాత్రి వరకు అమెరికాలో లక్షా 40 వేల మందికి వైరస్ సోకింది. ఇప్పటికే 2400 మందికి పైగా మరణించారు.

More Telugu News