KCR: ఇక విదేశాల నుంచి తెలంగాణలోకి కరోనా వచ్చే అవకాశమే లేదు: సీఎం కేసీఆర్

  • 11 మంది బాధితుల్లో కరోనా నెగెటివ్ వచ్చిందన్న సీఎం
  • మరో 58 మందికి చికిత్స కొనసాగుతుందని వెల్లడి
  • కరోనా చాలా షార్ప్ అంటూ వ్యాఖ్యలు
CM KCR says there is no chance of corona entry from abroad

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 అని, ఒక వ్యక్తి డిశ్చార్జి అయ్యాడని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా బాధితుల్లో 11 మందికి నెగెటివ్ రావడం శుభవార్తగా భావిస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. ఇక తమ వద్ద 58 మంది బాధితులు ఉంటారని, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి కోలుకున్నవారిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

25,937 మందిపై నిఘా ఉందని, వారిలో 14 రోజుల పరిశీలన పూర్తయిన వారిలో కరోనా లక్షణాలేవీ లేకపోతే పంపించివేస్తామని అన్నారు. మార్చి 30 నాటికి 1899 మందిని, మార్చి 31 నాటికి 1450 మందిని... ఇలా దశలవారీగా లక్షణాలు లేనివారిని  పంపించేస్తామని వెల్లడించారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు మూతపడడంతో బయటి దేశాల నుంచి కరోనా బాధితులు వచ్చే అవకాశం లేదని, తెలంగాణలో ఉన్న వారికి నయం చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడమే తమ ప్రాధాన్య అంశమని తెలిపారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు లేవని, అందుకే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ ను ప్రయోగించడం జరిగిందని, ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా అందరూ అభినందిస్తున్నారని అన్నారు.

దక్షిణ కొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి 59 వేల మందికి సోకినట్టు గుర్తించారని సీఎం కేసీఆర్ వివరించారు. పాపం ఆ వ్యక్తికి తనకు కరోనా సోకినట్టు కూడా తెలియదని, అమాయకుడని అన్నారు. ఒక్క సూది మొన పైన కోట్ల సంఖ్యలో కరోనా క్రిములు ఉంటాయని, ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని స్పష్టం చేశారు. కరోనా క్రిమి చిన్నదైనా చాలా పదునైనదని, మనం జాగ్రత్తగా ఉండడమే ముఖ్యమని హెచ్చరించారు.

More Telugu News